'Jai Telangana' "Jai Jai Telangana" - TRSV

 

trsv


ఆత్మహత్యలు వినాశాకరమైనవి


తెలంగాణా ప్రజలు మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకున్నారు స్వరాష్ట్రం కోసం వారి ప్రతిబద్ధతను.ఇపుడు సెంటిమెంటు గా పేర్కొనబడే ఆకాంక్ష ఒక బలమైన ప్రజాస్వామికమైన, రాజ్యాంగానికి లోబడిన డిమాండుగా పరిణమించింది. ఏ ప్రజాస్వామిక వ్యవస్థ ఈ డిమాండును కాదనలేదు. ఈ ఉద్యమాన్ని, ఈ జనచైతన్యాన్ని కాదంటే, ఇక ఇది ప్రజాస్వామ్యమే కాజాలదు. ఒక రాష్ట్రం, వారి అభ్యుదయం కోసం స్వయంపాలనకోసం తిరిగి ఏర్పడాలనేది వారి ప్రఘాడ ఆకాంక్ష. తెలగాణ్యులు అమాయకులే కావొచ్చు, కాని అవివేకులుమాత్రం కాజాలరు. మళ్ళీ సీమాంధ్రుల తీపిమాటల బుట్టలో పడలేరు. నూటికి నూరు శాతం గెలిచారంటే అది ఒక గొప్పఐక్యతా ప్రదర్శనే మరి. ఉద్యమంలో ద్రోహులెప్పుడూ ఉంటారు. వాళ్లకు కూడా బుద్ధి వస్తుందని ఆశిద్దాము.

అయితే, యువకులు భావోద్రేకాలకు లోనయి అనవసరంగా ఆత్మహత్యలకు పాల్పడటం చాల బాధాకరమైన విషయము. అసలు తెలంగాణా రాష్ట్రం వాళ్ళకోసమే కదా మనందరం కోరేది. వాళ్ళు అనుభవించని తెలంగాణా మనకెందుకు. మా జీవితాలు ఎట్లాగో గడిపాం. వివక్షకు, శోషణకు, అపహాస్యాలకు, హేళనకు గురయ్యాము. మన పిల్లలు అట్లాంటి బాధలు అనుభవించ వద్దు. నిరాశ నిస్పృహను కలిగిస్తుంది. అక్కడినుంచి ఎన్నో వికారాలు బయలుదేరుతాయి. ఒకానొక బలహీనక్షణములో బ్రతకడమే అనవసరమనిపిస్తుంది. భయంకర క్షణాలని అధిగమించాలి. దీనికి మంచి ఉదాహరణ రామాయణంలో ఉంది. సీతమ్మను వెతికి వెతికి అలసిపోయి నిరాశకు గురి అవుతాడు హనుమంతుడు. సీతమ్మ కనపడలేదని ఎట్లా చెప్పగలడు రామునికి. పని చేయలేడు కాబట్టి, ప్రాణాలను వదిలేందుకు నిర్ణయిస్తాడు. అయితే క్షణంలో ఒక ధైర్య కిరణం అతని మదిలో వెలుగుతుంది. నేనైతే చచ్చిపోతాను, కాని తర్వాత పర్యవసానంగా ఏమౌతుంది అనికొంచెం సావధానంగా ఆలోచిస్తాడు మన మారుతి. అతనికి ఎంతో దారుణమైన చిత్రం గోచరిస్తుంది. 'నాకోసం వేచి వేచి రాముడు ఖిన్నుడౌతాడు . సీత జాడతెలియక శ్రీరాముడు ప్రాణాలు వదలడం ఖాయం. అది చూసి లక్ష్మణుడు కూడాచనిపోతాడు. ఇదంతా చూసి కిష్కింద రాజు, రాముని మిత్రుడు, సుగ్రీవుడు కూడా ఏదో చేసుకోరానిది చేసుకుంటాడు. తర్వాత వానర రాజ్యం నశిస్తుంది. అయోధ్యలో అల్లకల్లోలం చెలరేగుతుంది. ఇట్లాగ వినాశ పరంపర సాగిపోతుంది. ఇవన్నీ నా ఆత్మహత్య వల్ల కలిగే ఉపద్రవాలు. కాబట్టి, ప్రాణం విలువైనది. ఓపికతో నిష్టతో ప్రయత్నిస్తే లక్ష్యం తప్పక నెరవేరుతుంది' అని అనుకొని ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంటాడు హనుమంతుడు. "వినాశే బహవో దోషా జీవన్ ప్రాప్నోతి భద్రకం, తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవతి సంగమః " (సుందర కాండ) ఆత్మహత్య వినాశాకరమైనది. అది పాపకార్యం కూడాను. ఆత్మహత్య ఎన్నో దోషాలకు దారి తీస్తుంది. బ్రతికి ఉంటే ఎన్నడో ఒకనాడు తప్పక మనలక్ష్యం నెరవేరుతుంది. ప్రాణాలను కాపాడుకొని ఉద్యమించడమే అన్నివిధాల శ్రేయస్కరం. అని నిర్ణయించుకొని కృతార్థుడౌతాడు మన వీరహనుమాన్. ఆయనే మనకు ఆదర్శం, మార్గదర్శి. ఆత్మహత్యకు పాల్పడే వారు నరకలోకాలను అనుభవిస్తారని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. "అసుర్యా నామ తే లోకా అంధేన తమసా ఆవృతా: , తాం తే ప్రేత్యాభిగఛ్చంతి యే కే ఆత్మహనో జనా:" (శ్రీ ఈశోపనిషత్తు) అంటే ఆత్మహత్య చేసుకున్న జనులు, అంధకారము అజ్ఞానములచేత ఆవరింపబడిన అసుర (నరక) లోకాలను పొందుతున్నారు. అందుచేత -
"ఆత్మత్యాగమొద్దు తెలగాణ వీరుడా, మ
హాత్ములవోలె పోరు సల్పుదాం మనము, దు
రాత్ముల నికృష్ట నీతులను దునుమాడి, విజి
తాత్ములమై విరుచుకుపడదాము తుదకు."

సందర్భంలో ఒక ఉర్దూ కవి అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. थर थराते हैं अन्धेरे तो लरज़ थे क्यों हों? हर नयी सुबह कि तकलीक यूहीं होती हैనిరాశ చీకట్లు కమ్ముకుంటుంటే అట్లా ఎందుకు వణికిపోతావు మిత్రమా? ప్రతి ఉషోదయం ముందు ఇలాగే ఉంటుంది తంతు. ఇంకొక గొప్ప ఉర్దూ కవి ఇక్బాల్ ఏమంటాడో చూడండి. अगर उस्मानियों पर (read तेलंगानियों पर) खोय-- ग़म टूटा तो क्या ग़म है? के खून--सद हज़ार अंजुम से होती है सहर पैदा. (తెలంగాణీయుల) ఉద్యమకారుల మీద ఎన్ని కష్టాల పర్వతాలు విరుచుకుపడ్డా అవేమి భరించరాని బాధలు కావు. వాళ్ళు భయపడరు. కారణం, అసంఖ్యాక నక్షత్రాలు రాలిన తర్వాతే కదా శుభోదయం ప్రాప్తిస్తుంది.
అందుచేత తెలంగాణా వీరులారా, చచ్చి సాధించేది ఏమి ఉండదు. బ్రతికిఉన్నవారికే అన్నీ ప్రాప్తిస్తాయి. సత్యాన్ని గుర్తెరిగి ఓపిక సంయమనం ధైర్యంతో ముందుకు సాగుదాం. ఆత్మహత్య మహా పాపం, ఆశుభకరం. మనను కన్నవారికి ఆప్తులకు శోకాన్ని మిగిల్చిన వారమవుతాము. అలాంటి దురాలోచనలకు దూరంగా ఉండాలి. ఎవరైనా దారుణమైన విషయాన్ని చర్చిస్తే ఆ ధోరణి వారిలో గమనిస్తే అందులో దాగిఉన్న దుష్పరిణామాలను వారికి వివరించి చెడుమార్గము నుంచి వారిని తప్పించాలి. ఇది అందరి కర్తవ్యం.